-ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు
- సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులు
-2016-2017 విద్యా క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : వచ్చే విద్యా సంవత్సరంలోకూడా సీబీఎస్ఈ తరహా విద్యా క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనుంది. 2016-17కు సంబంధించిన విద్యా క్యాలండర్ పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. దీనిపై గురువారం సమావేశమైన అధికారులు మార్చి 21 నుంచి నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్లు క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 23 వరకు అడ్వాన్స్డ్ తరగతులు నిర్వహించి, ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 13 నుంచి తరగతులు ప్రారంభించే విధంగా నూతన విద్యా క్యాలెండర్ రూపొందించారు. దీనిపై త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 30 నుంచి దసరా సెలవులు (2016-17 క్యాలెండర్ ప్రకారం)
-వచ్చే విద్యా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు (15 రోజులు) దసరా సెలవులు.
-డిసెంబర్ 24, నుంచి 30 వరకు (ఏడు రోజులు) క్రిస్మస్ సెలవు దినాలు.
-జనవరి 11, 2017 నుంచి జనవరి 17, 2017 వరకు (ఏడు రోజులు) సంక్రాంతి సెలవులు.
-ఏప్రిల్ 24, 2017 నుంచి జూన్ 11, 2017 వరకు వేసవి సెలవులు
398 ప్రాథమిక స్కూళ్లలో జీరో అడ్మిషన్లు...
రాష్ట్రంలో 18,139 ప్రాథమిక పాఠశాలలుండగా, 398 స్కూళ్లలో జీరో అడ్మిషన్లు ఉన్నాయని విద్యా శాఖ ప్రకటించింది. 3244 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా,వాటిలో 4 స్కూళ్లలో జీరో అడ్మిషన్లు జరిగాయి. 4,583 ఉన్నత పాఠశాలల్లో.. 3 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు ఉన్నట్లు విద్యా శాఖ లెక్కలు చెప్తున్నాయి.
టీచర్లకు పని భారం తగ్గింపు...

సబ్జెక్టు టీచర్లకు పని భారం తగ్గించడానికి విద్యా శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ మేరకు కొన్ని పీరియడ్లను తగ్గించునుంది. వాటిని అవసరమైతే హెడ్మాస్టర్లు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని విద్యా శాఖ క్యాలెండర్లో సూచించారు. సబ్జెక్టు టీచర్లు రాని సమయాలలో హెడ్మాస్టర్లు పీరియడ్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విధంగా తెలుగు 31 పీరియడ్లు, హిందీలో 28 పీరియడ్లు, ఇంగ్లీష్‌లో 30 పీరియడ్ల చొప్పున, గణితంలో 30 పీరియడ్లు, ఫిజికల్ సైన్స్‌లో 32 పీరియడ్లు, బయోలాజికల్ సైన్స్‌లో 29 పీరియడ్లు, సోషల్‌స్టడీస్‌లో 30 పీరియడ్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.