తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్
- ఉమ్మడి ఏపీ చట్టాన్ని స్వీకరించిన ప్రభుత్వం
- సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు ఆచరణ రూపం
-27వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గం సుగమమైంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1994 చట్టంలోని నియామకాలు, క్రమబద్ధీకరణ నిబంధనలను, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, జీతభత్యాల విధానాలను తెలంగాణ ప్రభుత్వానికి అనువర్తింపచేస్తూ శుక్రవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. చట్టాలను, జీవో నం.212, 1994 నిబంధనలను, తెలంగాణ ప్రభుత్వానికి అన్వయించుకుంటూ అవసరమైన నిబంధనలను సవరిస్తామని, చట్టసభల ఆమోదం తీసుకుంటామని తెలియచేస్తూ ఆదేశాలను ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ గెజిట్‌లో దీనిని ప్రచురించనున్నారు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నవారితోపాటు అంతకు ముందు కూడా ఉద్యోగంలో ఉన్నవారు, అప్పటికే 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన వారికి వర్తించేవిధంగా అవసరమయితే నిబంధనలను మార్చి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను చేపడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున, క్యాబినెట్ సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం చట్టాలను, నిబంధనలను తీసుకువస్తారు. అవసరమయితే చట్టసభల ఆమోదం కూడా తీసుకుంటారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు తమ సంస్థ ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. ప్రతీ నెల నిర్ణీత వేతనం తీసుకుంటూ, పూర్తిస్థాయిలో అర్హతలుకలిగిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారు. కాంట్రాక్ట్ విధానంలో మధ్యలో గ్యాప్‌లు ఉన్నవారిని, క్రమశిక్షణాచర్యలు ఎదుర్కొన్న వారిని కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అనుమతిస్తారు. అయితే జీవో నం.22 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2015లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ 1994 చట్టం నిబంధనలను, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అనువర్తింప చేసుకోవాలని తన నివేదికలో సూచించింది. అదేవిధంగా జీవో నం.19 ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచనున్నారు. పెంచిన వేతనాలు జనవరి నుంచే అమలులోకి వస్తాయని ఆదేశాలలో స్పష్టంచేశారు