Search This Blog

Monday, February 22, 2016

గురుకుల నాదం

ఒత్తిడిలేని విద్యకు ప్రాధాన్యం 
కేజీ నుంచి పీజీ విద్యావిధానానికి చుక్కానిగా.. తెలంగాణ గురుకుల విద్యాలయాల పయనం 
ఈనాడు - హైదరాబాద్‌ 
‘‘మనం ఎవరికీ తీసిపోం...ఏదైనా సాధించాలనే తపన...అవకాశాల అన్వేషణ...కఠోరమైన సాధన... ఉక్కులాంటి క్రమశిక్షణతో ఆకాశమే హద్దుగా అద్భుతాలను ఆవిష్కరిద్దాం..’’ తెలంగాణలోని దళిత, గిరిజన గురుకుల విద్యాలయాల్లో గోడలపై కనిపించే నినాదమిది. లక్షల మంది పేద విద్యార్థులలో ఇలాంటి నినాదాలు స్ఫూర్తిని నింపుతున్నాయి. సాదాసీదా విద్యార్థులను అసాధారణ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలపై మోజుతో సర్కారు విద్యాసంస్థలపై ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో తెలంగాణలో ప్రభుత్వం, అధికారులు, అధ్యాపక బృందం వినూత్న పంథాతో వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన కేజీ నుంచి పీజీ విద్యావిధానానికి చుక్కానిగా ఈ సంస్థలు నిలుస్తున్నాయి. దేశానికే ఆదర్శంగా మారడంతో అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు తరలివచ్చి ఇక్కడ విధానాలను అధ్యయనం చేస్తున్నాయి.
‘‘తెలంగాణలోని గురుకులాలను చూస్తే నలందా విద్యాలయాలు గుర్తుకొస్తున్నాయి. విద్యార్థులను ఇక్కడ తీర్చిదిద్దేవిధానం అద్భుతం....వీరంతా దేశం గర్వించేలా ఉత్తమ పౌరులుగా ఎదగడం ఖాయం..’’ మేఘాలయ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల వ్యాఖ్యలివి.
‘‘వెలుగులను అందించమే విద్య లక్షణం. విజ్ఞాన సముపార్జన, ఆలోచనలు, ఆశలను సాకారం చేసుకోవడం, వ్యక్తిత్వ వికాసం, సుశిక్షితులుగా రూపొందించడమే విద్య పరమార్థం. చదువుకు అనువైన వాతావరణం ఉండాలి. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, వినయవిధేయతలను పెంపొందించాలి. హక్కులు, బాధ్యతలతో బతకడాన్ని నేర్పించాలి.’’ విద్యపై వేదాల సారాంశమిది. తెలంగాణ గురుకులాలు ప్రస్తుతం ఇదే బాటలో నడుస్తున్నాయి.
ఐపీఎస్‌ చదివి.. గురుకులాల బాధ్యత
మహబూబ్‌నగర్‌ జిల్లా మన్ననూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉండి చదువుకున్నారు. ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్‌(1995 బ్యాచ్‌) అధికారి అయ్యారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, అనంతపురం, హైదరాబాద్‌ జిల్లాల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారు. హార్వర్డ్‌ విశ్వవిధ్యాలయంలో ప్రజా పరిపాలనలో మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే చోటే పనిచేయాలంటూ ‘మా వూరికి రండి’ అని సామాజిక ఉద్యమాన్ని చేపట్టి ప్రశంసలు పొందారు. వసతిగృహంలో చదువుకున్నప్పటి నుంచే ఆయనలో వాటిని బాగుచేయాలని, విద్యార్థులకు మేలు చేయాలనే భావన ఉండేది. తన ఆశలు, ఆలోచనలను ప్రభుత్వానికి వివరించి గురుకులాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. సామాజికాంశాల అభివృద్ధికి ముందుకు రావడం అరుదైన అంశంగా భావించి ప్రభుత్వం ఆయనను గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా నియమించింది. నాలుగేళ్లుగా ప్రవీణ్‌కుమార్‌ ఈ వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికారు. తెలంగాణలోని ప్రతీగురుకులాన్ని సందర్శించి, ప్రతీ విద్యార్థిని కలిసిన ఘనత ఆయనది.
సంకల్పాన్ని పెంపొందిస్తూ.. 
గురుకులాల్లో రాయడం, చదవడం వచ్చిన అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చిన వారికి ప్రవేశాలుంటాయి. చేరిన తర్వాత వారి కుటుంబ పూర్వాపరాలను, వారి మనోభావాలను తెలుసుకుంటారు. జీవితమంటే ఒక్క చదువే కాదని, అనేక పార్శాలున్నాయని వివరిస్తారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సంకల్ప దీక్షతో ముందుకు సాగాలని ఉద్బోధిస్తారు. విద్యార్థులకు సరళంగా బోధనను అందించేందుకు వీలుగా దేశ, విదేశాల్లోని ప్రముఖ బోధన నిపుణులతో గురుకులాల్లోని అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించారు.
ఒత్తిడి లేని..ప్రమాణాలతో కూడిన విద్య
ఇక్కడ విద్యలో ఒత్తిడికి స్థానం లేదు. ప్రమాణాల పెంపుదలతోపాటు విషయ పరిజ్ఞానం, అభ్యాసం, ప్రయోగ జ్ఞానం పెంచుతున్నారు. మెడిసిన్‌, ఐఐటీ, ఇంజినీరింగు తదితర కోర్సులపై ఆసక్తి చూపే వారి కోసం ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించారు. పదోతరగతి, ఇంటర్‌లలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎంబీబీఎస్‌, ఇంజినీరింగులోనూ రాణిస్తున్నారు. బెంగళూరులోని అజీం ప్రేమ్‌జీ విశ్యవిద్యాలయానికి 22 మంది విద్యార్థులు ఎంపికై రికార్డు సాధించారు. ప్రాథమిక స్థాయి నుంచే సివిల్స్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మన టీవీలో వంద మందికి పైగా తెలంగాణ గురుకుల విద్యార్థులు చక్కగా పాఠాలను బోధిస్తున్నారు.
అవినీతికి దూరంగా.. 
వసతిగృహాలు, గురుకులాల్లో అవినీతి తాండవిస్తూ ఉండేది. దానికి అడ్డుకట్ట పడింది. బియ్యం, కూరగాయలు, నిధులు, నిర్వహణ అంతా చక్కటిదారిలో పడింది. విధి నిర్వహణ, హాజరీ విధానాలు నూటికి నూరుశాతం అమలవుతున్నాయి.
ఎందరికో మార్గనిర్దేశనం
ఒకరు ఐఏఎస్‌, ఇద్దరు ఐపీఎస్‌లు, మరో ఐదుగురు కేంద్ర సర్వీసు అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, విద్యావేత్తలు....ఐదువేల మందికి పైనే.... ఇంకా వేల మంది ఉన్నత విద్యావంతులు... వీరంతా దళిత కాలనీల్లోని పూరి గుడిసెలలో ఉద్భవించిన విద్యాకుసుమాలు. ఆణిముత్యాల్లాంటి వారందరినీ గురుకుల సంస్థ సమీకరించింది. వారంతా గురుకులాలకు వచ్చి వారు ఎదిగిన క్రమాన్ని వివరించి విద్యార్థులలో స్ఫూర్తి నింపుతున్నారు. ‘స్వారోస్‌’ పేరిట విద్యార్థులు గురుకుల పత్రికను నిర్వహిస్తున్నారు. 

సాహస క్రీడలతో కొత్త చరిత్ర 
2014లో నిజామాబాద్‌ జిల్లా మానాల, ఖమ్మం జిల్లా చర్ల అటవీ ప్రాంతాలకు చెందిన గురుకుల విద్యార్థులు మాలావత్‌ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లు 29వేల మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా పూర్ణ గుర్తింపు పొందింది. 2015లో 31 మంది విద్యార్థులు 17 వేల అడుగుల ఎత్తైన మౌంట్‌ రెనాక్‌ పర్వతాలను అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. పాలమూరు కూలీల కుమారుడైన 16 ఏళ్ల విద్యార్థి పి.సుందర్‌రాజ్‌ కౌలాలంపూర్‌లో జరిగిన ప్రపంచ యోగా పోటీల్లో పాల్గొని రెండు వేర్వేరు విభాగాల్లో స్వర్ణ, రజత పతకాలను సాధించాడు. 

చదువొక్కటే కాదు..ఇష్టమైన వ్యాపకాలకు ప్రాధాన్యం 
దువుతో పాటు తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిస్తారు. ఎక్కువ మంది క్రీడల వైపు మొగ్గు చూపగా, మరికొంత మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌సీసీ, సైన్స్‌, ఫోటోగ్రఫీ, రోబోటిక్‌, సాంస్కృతికం, చిత్రలేఖనం, నటన, చిత్ర నిర్మాణం, సంగీతం, హస్తకళలు, అబాకస్‌, యానిమేషన్‌, పాత్రికేయం, వేదమంత్రాలపై సైతం శిక్షణ తీసుకుంటున్నారు. విదేశీ జీవన విధానంపై పూర్తిగా విదేశీయులతోనే శిక్షణ ఇస్తారు. నాయకత్వ శిబిరాలను నిర్వహిస్తారు.నిత్యం యోగా, నడక, ధ్యానం వంటివి విధిగా చేయిస్తారు. ప్రతీ వారం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. క్రీడోత్సవాలు, సైన్స్‌ ఫెయిర్లు జరుగుతాయి. ఆత్మన్యూనత, ఇతర సమస్యలను మానసిక నిపుణుల ద్వారా తొలగిస్తున్నారు. విద్యార్థుల బాగోగులు తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు వారి వూళ్లకు సైతం వెళ్తారు. 

ప్రారంభదశలోనే మా లక్ష్య సాధన 
ప్రభుత్వాలు, తల్లిదండ్రులు విద్యకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించాలి. ప్రభుత్వ విద్యాలయాలకు ఎన్నో సౌలభ్యాలున్నాయి. నిపుణులైన బోధకులున్నారు. రాష్ట్రంలోని లక్షల మంది పేద విద్యార్థులను చక్కటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ తోడ్పాటు, ఇతర సిబ్బంది సహాయ సహకారాలతో నావంతు కృషి చేస్తున్నా. మా లక్ష్యం ఇంకా ఆరంభ దశలోనే ఉంది. వంద శాతం లక్ష్యాన్ని చేరడానికి ఎంతో శ్రమించాల్సి ఉంది.
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌,
తెలంగాణ దళిత, గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి

ఇదొక మహాయజ్ఞం 
దో మహాయజ్ఞం ఇందులో మేం పాలు పంచుకుంటున్నాం. విద్యార్థులంతా మా పిల్లలనే భావనతో పనిచేస్తున్నాం. వారి ఘనతను చూసి ఉప్పొంగిపోతున్నాం. మాకూ గురుకుల అధ్యాపకులుగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.
- రామ్‌లక్ష్మణ్‌, అధ్యాపకుడు

ఇక్కడ చదువొక్కటే కాదు.. 
గురుకులంలో ఉంటే మాకు ఏ లోటు తెలియదు. చదువుతో పాటు అన్ని అంశాలపైనా మాకు ఆసక్తి పెరిగింది. నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలన్న తపనను ఇక్కడి ఉపాధ్యాయులు రగిలిస్తుంటారు.
- ప్రశాంత్‌, గురుకుల విద్యార్థి

మేం శక్తిస్వరూపిణులమే 
మేం శక్తి స్వరూపిణులమేనని ప్రవీణ్‌ సార్‌ చెప్పారు. ఇందుకు అనుగుణంగా మేం గురుకులాల్లో శిక్షణ పొందుతున్నాం. మాకు తెలియని విషయం ఏమీ ఉండరాదని ఎప్పుడూ చెబుతారు. ఆయన చూపిన బాటనే మేమంతా పయనిస్తున్నాం.
- లావణ్య, విద్యార్థిని
SCIENCE VIDEOS


MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES