Search This Blog

Saturday, February 20, 2016

ఇదేం ‘శిక్ష’ణ

పటాన్‌చెరు : విద్య వ్యాపారంమైనది...ఇదే విద్య ఇప్పుడు వికటించింది. లక్షల ఫీజులను వసూలు చేసే యాజమాన్యాలు తల్లిదండ్రులకు ర్యాంకులు చూపించేందుకు విద్యార్థులపై ప్రదర్శిస్తున్న జులుం పరాకాష్టకు చేరినట్టు తెలుస్తోన్నది. పటాన్‌చెరు నియోజకవర్గంలో రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మార్కుల టార్చర్ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్కులు, ర్యాంకులే లక్ష్యం చేసి యాజమాన్యాలు జైల్లలాంటి హాస్టళ్లలో చదువుల పేరిట చేస్తున్న అరాచకాలకు అంతమే లేదు. రోజుకొక పరీక్ష పెట్టి తల్లిదండ్రులకు ఫోన్‌లలో ప్రోగ్రెస్ చూపించి వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. మెరిట్ స్టూడెంట్లను సైతం ఒక్క పరీక్షలో వెనుకబడ్డా వారిని అవహేళన చేసి నానా హంగామాను సృష్టిస్తున్నారు.

ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అర్థం కాక టీనేజీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాలేజీల్లోనే ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆ విషయాలను కార్పొరేట్ కళాశాలలు బయటకు పొక్కనీయకుండా చూస్తుండడం మరో దారుణం. ఈ దారుణాలు బయటకు రాకుండా ఖాకీలు యథాశక్తి అండగా ఉంటుండం విస్మయం చేకూరుస్తున్నది. 
పటాన్‌చెరు నియోజకవర్గం నగరానికి ఆనుకుని ఉండడంతో పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలు తమ బ్రాంచ్‌లను ఇక్కడ పెడుతున్నాయి. భారీ అపార్టుమెంట్లను లీజుకు తీసుకుని వాటిలో ఈ హాస్టల్‌తో కూడి ఇంటర్‌మీడియట్ విద్యను అందజేస్తున్నారు. ఎంసెట్, ఐఐటీల్లో లాంగ్ టెర్మ్‌శిక్షణను ఇక్కడ అదనంగా ఇస్తున్నారు. పదో తరగతి పాస్ అయిన టీనేజ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఇక్కడే తీర్చుదిద్దుతున్నామని కార్పొరేట్ కళాశాలలు చేస్తున్న ప్రచారంతో తల్లిదండ్రులు విద్యార్థులను ఈ కళాశాలల్లోనే పోటీపడి చేరుస్తున్నారు. 24గంటల పాటు ఈ హాస్టళ్లలో విద్యార్థులుంటూ చదువుకోవాలి. ఈ మార్కుల శిక్షణను తట్టుకోలేక విద్యార్థులు తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఈ రోజు పరీక్షలు ఆరోజు నిర్వహించి ఆ మార్కులను తల్లిదండ్రులకు సెల్‌లో చూపుతూ విద్యార్థులను మానసికంగా టార్చర్ పెడుతున్నారని సమాచారం. ఈ మార్కులు వారు పెట్టే ఇంటర్నల్ పరీక్షల్లో కానీ అవి ఫైనల్ ఎగ్జామ్స్ తప్పినంత సీన్‌ను క్రియేట్ చేయడంతో తల్లిదండ్రులు ఫోన్‌లో తమ పిల్లలను మందలిస్తున్నారు. జీవితం అంటేనే మార్కులు అన్నతీరుగా అందరూ ప్రవర్తిస్తూ వత్తిడి తెస్తుండడం విద్యార్థులపాలిట శాపంగా మారింది.

ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య...


మార్కులకంటే ఎంతో విలువైన ప్రాణాలను టీనేజీ విద్యార్థులు తీసుకుంటున్నారంటే కార్పొరేట్ కళాశాలల ఒత్తిడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 18 రోజుల క్రితం పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లో చైతన్య ఐఐటీ అకాడమీలో సూరజ్ అనే విద్యార్థి కళాశాల పైకెక్కి ఆత్మహత్య చేసుకునేందుకు కిందకు దూకాడు. తీవ్ర గాయాలకు గురైన సూరజ్(17)ను కళాశాల యజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఓ కార్పొరేట్ దవాఖానలో వైద్య చికిత్సను ఇప్పించింది. 

చివరికి ఈ నెల 14న సూరజ్ దవాఖానలో మృతి చెందాడు. సూరజ్ మృతి చెందాడన్న సంగతి తోటి క్లాస్‌మెట్‌లకు సైతం తెలియనియ్యలేదు. గురువారం సూరజ్ తల్లిదండ్రులు కళాశాల వద్దకు రావడంతో విద్యార్థులకు విషయం తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు కళాశాలపైకి రాళ్లు రువ్వి, అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో కళాశాలలో పాక్షిక నష్టం చేకూరింది. యాజమాన్యం ఆర్సీపురం పోలీసులను పిలవడంతో వారు తమదైన శైలిలో విద్యార్థులను శాంతింపజేశారు. మరో సంఘటన ఆర్సీపురం మండలం వెలిమెలలో చోటు చేసుకుంది. నారాయణ ఐఐటీ ఫౌండేషన్ కళాశాలలో 2015 డిసెంబర్ 16న రుత్వీక్ నందన్(16) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి మార్కులు బాగా రావడం లేదనే ఒత్తిడే కారణంగా తేలింది.

రుత్వీక్ నందన్ రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడితే అతడిని చికిత్స చేయిస్తామని యజమాన్యం దవాఖానకు తీసుకువెళ్లింది. రుత్వీక్ నందన్ మృతి చెందాకనే యజమాన్యం దవాఖానబాట పట్టిందని ఆరోపిస్తూ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలపై రాళ్లు రువ్వీ, అద్దాలను, పూల కుండీలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. యాజమాన్యం బీడీఎల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారోచ్చి విద్యార్థులను చెదరగొట్టారు. రెండు సంఘటనలు రెండు నెలల వ్యవధిలోపే జరగడం ఆలోచింపజేస్తున్నది. మార్చి నెల దగ్గరకు వస్తుండడంతో మార్కుల రేసును యాజమాన్యాలు ప్రారంభించడంతో ఈ దారుణాలు జరుగుతున్నాయి. 

తప్పేవరిది..?


ఒక వైపు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులు ఈ కార్పొరేట్ కళాశాలల్లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. మరో పక్క మార్కులు బాగా వచ్చేందుకు యాజమాన్యాలు అసాధ్యమైన టైంటెబుల్స్‌ను అమలు చేస్తున్నాయి. తెల్లవారు జామునే లేపి రీడింగ్ చేయిస్తున్నారు. ఉదయం వేళలో నిమిషాల సమయం ఇచ్చి కాలకృత్యాలు, టిఫిన్స్ చేసేలా చూస్తున్నారు. ఆ పై క్లాసులు మధ్యాహ్నం లంచ్ బ్రేక్, ఆ తరువాత క్లాసులు చెబుతున్నారు. సాయంత్రం స్నాక్స్‌ను ఇచ్చి మళ్లీ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఆ తరువాత రోజువారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం డిన్నర్ పెట్టి మళ్లీ అర్ధరాత్రివరకు చదివిస్తున్నారు. చాలీచాలని నిద్రతో పాటు ఒకే రకమైన కృత్యాలను చేస్తూ విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రతి చోట నిఘాకు సీసీ కెమెరాలను పెట్టి జైళ్లను మించిన శిక్షను ఇక్కడ అమలు చేస్తున్నారు. ఈ కళాశాలల్లో చేరిన విద్యార్థులకు పౌష్టిక ఆహారం సైతం పెట్టడం లేదనే విమర్శ ఉంది. 

విద్యార్థులు రెండేళ్లకాలంలో బరువు తగ్గి బయటకు వస్తున్నారని సమాచారం. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్న ఈ సంస్థలు చేస్తున్న విద్యావ్యాపారానికి విద్యార్థులు ముడి సరుకుగా మారారు. పోటీ ప్రపంచంలో ఒక్కో మార్కు విలువైనదని చెబుతూ కళాశాల యాజమాన్యాలు చేస్తున్న హింసను తల్లిదండ్రులు మౌనంగా భరిస్తున్నారు. విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వారికి పోలీసుల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులపై ఒత్తిడి తీసుకుని వస్తున్నారని సమాచారం. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల వద్దకు వచ్చి రాజీపడి తమ పిల్లలను ఆ కళాశాలల్లోనే కొనసాగిస్తున్నారు. మార్చి నెలవరకు ఇంకెన్ని దారుణాలు చోటు చేసుకుంటాయోనని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యార్ధుల మరణాలపై అధికారులు విచారణ చేయాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

SCIENCE VIDEOS


MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES