Search This Blog

Wednesday, February 3, 2016

భవితకు కామర్స్‌ కోర్సులు!

భవితకు కామర్స్‌ కోర్సులు!
పదో తరగతి తర్వాత తీసుకునే ఇంటర్మీడియట్‌ గ్రూపు... విద్యార్థి కెరియర్‌ మార్గాన్ని దాదాపు నిర్ణయించేస్తుంది. ‘ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లలో ఏదో ఒకటి’ అనే మూస ఆలోచన నుంచి బయటపడి కామర్స్‌లో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలనే ధోరణి పెరుగుతోంది. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఎన్ని రకాల మార్గాలున్నాయి? ఆ సంగతులేమిటి?
సామాన్య గుమాస్తాల నుంచి దేశ ఆర్థిక రంగాన్ని శాసించే ఆర్థిక నిపుణుల వరకూ కామర్స్‌ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. దీనిలో ఏ కోర్సు తీసుకుని చదివినా జీవితంలో స్థిరపడవచ్చు. దేశంలో అకౌంటెంట్ల కొరత ఏ స్థాయిలో ఉందో వ్యాపార రంగంలో ఉన్నవారికి తెలుసు. కామర్స్‌ రంగానికి ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పది తరువాత కామర్స్‌ రంగంవైపు ఎలా వెళ్లవచ్చు అనేది విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
కామర్స్‌ కోర్సులను 3 విభాగాలుగా పరిగణించవచ్చు.
ఇంటర్‌ ఎంఈసీ/ సీఈసీ
సీఏ సీఎంఏ సీఎస్‌
ఎంఈసీ
సైన్స్‌ సబ్జెక్టు అయిన మ్యాథ్స్‌; కామర్స్‌ సబ్జెక్టులైన ఎకనామిక్స్‌, కామర్స్‌ల కలయికే ఈ గ్రూపు. ‘మ్యాథ్స్‌ అంటే మక్కువే కానీ ఫిజిక్స్‌, కెమిస్ట్రీలంటే భయం’ అనుకునేవారు నిశ్చింతగా ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకోవచ్చు. సైన్స్‌, కామర్స్‌ల మేలు కలయిక కాబట్టి దీన్ని చదవటం వల్ల కెరియర్‌ను ఎలాగైనా మలుచుకోవచ్చు.
ఇంటర్‌లో ఎంఈసీ చదివి భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్‌, లా వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు, బి.ఎస్‌.సి., బి.కాం, బి.బి.ఎం వంటి డిగ్రీలు చేసి ఎం.కాం. ఎం.బి.ఏ. ఎం.సి.ఏ వంటి కోర్సులు పూర్తి చేయవచ్చు. సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంక్‌ పరీక్షలూ, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే కూడా ఇంటర్‌లో ఎంఈసీసి గ్రూపు నేపథ్యం ఉపయోగపడుతుంది.
సీఈసీ
ఇది కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టుల కలయిక. ఈ గ్రూపు చదివినవారికి సైన్స్‌ గ్రూపువారికి మాదిరే మంచి అవకాశాలున్నాయి. ఇంటర్‌లో సి.ఇ.సి. చదివి, డిగ్రీ పూర్తిచేసి అనేక రంగాల్లో ప్రవేశించవచ్చు. లా పూర్తి చేయడానికీ; సివిల్స్‌, ఇతర పోటీ పరీక్షలు రాయడానికీ సి.ఇ.సి. గ్రూపులోని సబ్జెక్టులే కీలకం. ఎక్కువశాతం జనరల్‌ నాలెడ్జ్‌, సమాజానికి, రాజ్యాంగానికి సంబంధించి, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అంశాలతో కామర్స్‌ను అనుసంధానం చేయడం వల్ల ఈ గ్రూపునకు ప్రాధాన్యం పెరిగింది.
‘కామర్స్‌ కెరీర్‌ కావాలి కానీ మ్యాథ్స్‌ అంటే భయం’ అనుకునేవారు నిశ్చింతగా ఈ గ్రూపు తీసుకోవచ్చు. సి.ఇ.సి. గ్రూపు తీసుకొని సి.ఎ., సి.ఎం.ఎ., సి.ఎస్‌. వంటి వృత్తివిద్యాకోర్సులు పూర్తి చేయవచ్చు.
కంపెనీ సెక్రటరీ కోర్సు
దు కోట్లకు పైబడి మూలధనమున్న కంపెనీలు, స్టాక్‌ ఎక్సే్చజ్‌లలో నమోదు కావాలనుకుంటున్న కంపెనీలు తప్పనిసరిగా పూర్తిస్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాల్సివుంటుంది. నేర్పుతో, ఓర్పుతో వ్యాపారవేత్తలకు ఎప్పటికప్పుడు సమయానుగుణంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారే కంపెనీ సెక్రటరీలు.
సి.ఎస్‌. కోర్సును ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ICSI)నిర్వహిస్తుంది. ఇది పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టబద్ధమైన సంస్థ. సి.ఎస్‌. కోర్సును ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ అనే మూడు స్థాయుల్లో పూర్తి చేయవలసివుంటుంది.
సి.ఎస్‌. ఫౌండేషన్‌: సి.ఎస్‌. ఫౌండేషన్‌ పరీక్షను కూడా సి.ఎ. కోర్సులోని సి.పి.టి. పరీక్ష మాదిరిగా ప్రవేశపరీక్ష రూపంలో నిర్వహించబోతున్నారు. అంటే ఈ పరీక్షను మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలోకి మార్చారు. పరీక్ష మొత్తం 200 ప్రశ్నలు, 400 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు అన్నమాట. ఈ పరీక్షను జూన్‌, డిసెంబర్‌లలో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు.
సి.ఎస్‌. ఎగ్జిక్యూటివ్‌: సి.ఎస్‌. ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష (రెండు మాడ్యూల్స్‌గా 7 పేపర్లు) రాయవచ్చు. ఈ పరీక్ష కూడా జూన్‌, డిసెంబర్‌లలో ఏటా రెండుసార్లు జరుగుతుంది.
ఎగ్జిక్యూటివ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు 15 నెలల పాటు మేనేజ్‌మెంట్‌ శిక్షణ, మరో మూడు నెలలపాటు ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకోవల్సి ఉంటుంది.
సి.ఎస్‌. ప్రొఫెషనల్‌: ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించినవారు/ ఉత్తీర్ణత సాధించి మేనేజ్‌మెంట్‌ శిక్షణ పూర్తిచేసుకున్నవారు ప్రొఫెషనల్‌ ప్రోగ్రాం చదవడానికి అర్హులు. ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష రాసిన సంవత్సరం తరువాత ఈ ప్రొఫెషనల్‌ పరీక్ష (మూడు మాడ్యూల్స్‌గా 9 పేపర్లు) రాయాల్సివుంటుంది. మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి 50 శాతం సగటు మార్కులను సాధిస్తే విద్యార్థి మాడ్యూల్‌/ ప్రొఫెషనల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు.
CA, CMA, CS కోర్సులే కాకుండా మిగతా కామర్స్‌ కోర్సులైన M.Com, MBAచేసినవారికి కూడా మెరుగైన అవకాశాలున్నాయి.


సీఎంఏ కోర్సు
సీఏతో పాటు సీఎంఏ (ఐసీడబ్లు్యఏ) కోర్సుకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. ఉద్యోగావకాశాల పరంగా అనుకూలమై, సులువుగా తక్కువ సమయంలో పూర్తిచేయగలిగిన కోర్సు ఇది. సీఏ కష్టం అనుకునే విద్యార్థులు సాధారణంగా బీకాం గానీ, ఎంబీఏ గానీ చేస్తారు. కానీ అదే సమయంలో సీఎంఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సును పూర్తిచేసి, త్వరగా స్థిరపడవచ్చనే అవగాహనతో దీనివైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు.
ఐసీడబ్లు్యఏ కోర్సును ఇప్పుడు సీఎంఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌)గా వ్యవహరిస్తున్నారు. ఇది చదవాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్‌వారైనా అర్హులే. దీనిలో ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి.
సీఎంఏ ఫౌండేషన్‌: ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రతి ఏడాదీ మార్చి, జూన్‌, సెప్టెంబరు, డిసెంబరులలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల రూపంలో ఒకేరోజు నిర్వహిస్తారు. దీనిలో 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. అలాంటివారిని ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటిస్తారు.
సీఎంఏ ఇంటర్‌ (సీఎంఏ ఎగ్జిక్యూటివ్‌) కోర్సు : సీఎంఏ ఫౌండేషన్‌ కోర్సు పూర్తిచేసినవారు సీఎంఏ ఇంటర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్‌ పరీక్ష రాయటానికి అర్హులు. ఇది పూర్తయినవారు ఒక ప్రొఫెషనల్‌ కాస్ట్‌ ఎకౌంటెంట్‌ దగ్గర/ గుర్తింపు పొందిన సంస్థల్లో ఆర్నెల్లపాటు ప్రాక్టికల్‌ శిక్షణ పొందాల్సివుంటుంది.
సీఎంఏ ఫైనల్‌ కోర్సు: ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తయిన విద్యార్థి ఫైనల్‌ పరీక్షను రాయవచ్చు. ఇది పూర్తిచేసినవారిని ఇన్‌స్టిట్యూట్‌ వారి కంప్యూటర్‌ శిక్షణ పూర్తయ్యాక క్వాలిఫైడ్‌ కాస్ట్‌ ఎకౌంటెట్లుగా పరిగణిస్తారు.


సీఏ కోర్సు
కప్పుడు దీన్ని డిగ్రీ తరువాత చేసేవారు. తరువాత ఇంటర్‌ పూర్తిచేశాక చదివే అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడైతే సి.ఏ. ఇనిస్టిట్యూట్‌ వారు పదో తరగతి తరువాతే ఈ కోర్సులో ప్రవేశించే అవకాశం కల్పించారు.
ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థి సీఏ కోర్సుకు నమోదు చేసుకొని సీఏ కెరియర్‌ను ప్రారంభించవచ్చు.
ఇంటర్‌ MEC/MPC/BiPC/CEC/HECఇలా ఏ గ్రూప్‌ వారైనా ఈ కోర్సు చదవవచ్చు. అయితే చాలామంది ఇంటర్‌లో ఎం.ఇ.సి. గ్రూపుతోపాటే సి.ఎ. కూడా ఏకకాలంలో చదవటానికే సుముఖత చూపిస్తున్నారు. దీనివల్ల వారు దాదాపు 6 నెలల సమయాన్ని ఆదాచేసుకుంటున్నారు.
ఇంటర్‌ ఎంఈసి లేదా సీఈసీ గ్రూపు తీసుకొని ఇంటర్‌తోపాటు సీపీటి (కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్టు)ని సమాంతరంగా పూర్తి చేయవచ్చు. ఈ లక్ష్యంతోనే రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఇంటర్‌తోపాటుగా లాంగ్‌ టర్మ్‌ సీపీటీ కోచింగ్‌ను అందిస్తున్నాయి.
ఇంటర్‌ MPC/BiPC/HECగ్రూపు వారు ఇంటర్‌ తరువాత 6 నెలలకు సీపీటీ పూర్తి చేయవచ్చు.
తరువాత 9 నెలలకు ఐపీసీసీ, అది పాసైన రెండున్నర సంవత్సరాలకు సీఏ ఫైనల్‌ పరీక్ష రాసి, సీఏ కోర్సు పూర్తిచేయవచ్చు.
అంటే ఇంటర్‌ తరువాత కేవలం 4 సం॥లకే సీఏ కోర్సును పూర్తిచేసి జీవితంలో స్థిరపడవచ్చు.

SCIENCE VIDEOS


MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES