Search This Blog

Tuesday, February 16, 2016

పరీక్షల కాలం.. జాగ్రత్తలు అవసరం

పరీక్షల కాలం.. జాగ్రత్తలు అవసరం 
విద్యార్థులూ తస్మాత్‌ జాగ్రత్త 
నిద్ర, ఆరోగ్యానికి సమయం కేటాయించాలంటున్న నిపుణులు 
గరివిడి, న్యూస్‌టుడే: పరీక్షల సమయం సమీపిస్తోంది.. అధిక మార్కులే లక్ష్యంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. ఇళ్లవద్ద తల్లిదండ్రులు రాత్రింబవళ్లు చదివిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఒత్తిడి.. ఆందోళన పెరిగి ఉన్న కొద్దిపాటి సమయం కూడా నిద్రకు దూరమవుతున్నారు. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదంటున్నారు నిపుణులు.. పరీక్షలకు ముందు నిద్రకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్తులో దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు..
నేటి పోటీ ప్రపంచంలో మార్కులకే ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల అభిరుచిని తల్లిదండ్రులు పట్టించుకోకుండా మంచి మార్కుల కోసం పేరున్న విద్యాసంస్థల్లోనే చేర్పిస్తున్నారు. ఎంత ఖర్చయినా వెచ్చిస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు మంచి మార్కులు తెప్పించి మరింత గుర్తింపు పెంచుకోవాలనే లక్ష్యంతో విద్యార్థులను రాత్రింబవళ్లు చదివిస్తున్నారు. దీంతో వారు మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది భవిష్యత్తులో వారి అనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
చిట్కాలు పాటించాలి 
విద్యార్థులు ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్లి రాత్రి 8 లేదా 9 గంటలకు గాని ఇంటికి చేరలేకపోతున్నారు. దీనికితోడు మితిమీరిన హోంవర్కు ఉంటుండడంతో ఇంటికి చేరాక రాత్రి 11 గంటల వరకు సమయం కేటాయిస్తున్నారు. ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేవడం మళ్లీ హడావుడి.. దీంతో పిల్లలకు విశ్రాంతి కొరవడుతుంది. పదోతరగతి, ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రత్యేక తరగతులు, పరీక్షల పేరుతో ఒత్తిడి పెరుగుతుంది. వీరైతే నిద్రకు మూడు నాలుగు గంటలు మించి కేటాయించలేక పోతున్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయి చదివింది కూడా గుర్తుండడం లేదు. ఎన్నిసార్లు చదివినా కొద్దిసేపటికే మర్చిపోతున్నామని పిల్లలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు మానసిక నిపుణులు రెహ్మాన్‌.. ఆయన చేసిన సూచనలి..
* పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు బృందాలుగా చదివేటప్పుడు ముగ్గురికంటే ఎక్కువమంది ఉండకూడదు. తనకు తెలిసింది ఎదుటివారికి వివరించడం ద్వారా ఎప్పటికీ మరచిపోం. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* అదేపనిగా కేవలం తరగతికి సంబంధించిన పుస్తకాలనే చదవకుండా మధ్యమధ్యలో కొంతసమయం తమకు నచ్చిన పుస్తకాలు చదవాలి. మంచి ఆహ్లాదకరమైన సంగీతం వినాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* చదువుతున్నపుడు మధ్యలో గట్టిగా గాలిపీల్చి వదులుతుండాలి. ముక్కులో ఒకరంధ్రం నుంచి గాలిపీల్చి మరోరంధ్రం ద్వారా వదలాలి. ఇలా చేయడం వల్ల మనస్సు తేలికబడుతుంది. ధ్యానం కూడా మంచి ఫలితాలిస్తుంది.
నిద్రతో ఉపశమనం.. 
సరైన నిద్రలేకపోతే విద్యార్థులకు ఎదురయ్యే అనారోగ్య సమస్యల గురించి వైద్యాధికారి ఎన్‌.భార్గవి వివరించారు.
* పిల్లల్లో నిద్రలేమి వల్ల దీర్ఘకాలిన అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరం నొప్పులతో ఇబ్బంది పెడుతుంది. మానసిక ఆందోళన, సమస్యలు ఎదురవుతాయి. సరైన ఆలోచనలు రాక పరీక్షలు కూడా సరిగ్గా రాయలేరు.
* పదోతరగతి, ఇంటర్‌ చదివే విద్యార్థులు ప్రతిరోజు 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. పదోతరగతి లోపు విద్యార్థులైతే పదిగంటలు నిద్ర తప్పనిసరి. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల రక్తకణాలకు శక్తిపెరిగి మరసటి రోజు హుషారుగా ఉండడానికి దోహదపడుతుంది.
* పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు వంటివి మేలుచేస్తాయి. మసాలాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. పాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌ను దరి చేరనీయవద్దు.
* అల్పాహారం ఉదయం 8 గంటల్లోపు, మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు తీసుకోవాలి. రాత్రి 8 గంటలకు భోజనం చేయాలి. రాత్రి 9 గంటలకు నిద్రకు ఉపక్రమించి ఉదయం నాలుగు గంటలకు లేచి చదివితే విద్యార్థికి ఒత్తిడి ఉండదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి పరీక్షలు బాగా రాయగలరు.
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే.. 
కొంతమంది విద్యార్థులకు ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు. వెంటనే మరచిపోతుంటారు. ఏకాగ్రత లేకపోవడమే అందుకు కారణం. మనిషి మెదడులోని షార్ట్‌, లాంగ్‌ మెమరీలుంటాయి. షార్ట్‌ మెమరీలోకి వెళ్లినవి కొద్దిసేపటికి మరచిపోతాం. లాంగ్‌ మెమరీలోకి వెళితే ఎంతకాలమైనా మరిచిపోమని పరిశోధనల్లో తేలింది. ఆందోళనతో ఏకాగ్రత లేకుండా చదివినవి షార్ట్‌మెమరీలోకి వెళ్లి మరచిపోతాం. దీన్ని లాంగ్‌ మెమరీలోకి వెళ్లేవిధంగా చేయడానికి ఒక విధానాన్ని కనిపెట్టారు. అదే ఎస్‌క్యూఆర్‌ మెథడ్‌. అంటే చదవడం, ప్రశ్నలు వేసుకోవడం, మననం చేసుకోవడం. దీని ప్రకారం విద్యార్థి మొదట ఒక అంశాన్ని ఎంచుకుని దాన్ని చిన్న భాగాలుగా చేసుకోవాలి. మొదట దాన్ని చదివి అర్థం చేసుకోవాలి. అందులోనుంచి తానే ప్రశ్నలు తయారు చేసుకుని వాటికి సమాధానాలు ఇవ్వాలి. రెండు మూడుసార్లు చదివి మననం చేసుకోవాలి. ఈ విధానంలో 20 శాతం చదవడం, 80 శాతం మననం చేసుకోవాలి. అప్పటికీ గుర్తురాకుంటే మరోసారి ప్రయత్నించాలి. ఈ విధంగా చేస్తే పరీక్షల సమయంలో మర్చిపోవడం ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈవిధంగా చదువుతూ ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. దీనివల్ల మననం చేసుకున్నది లాంగ్‌ మెమరీకి వెళ్లి మర్చిపోకుండా ఉంటారు.
తల్లిదండ్రుల బాధ్యత 
* విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత కూడా ఉంది.
* పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో అనువైన వాతావరణం కల్పించాలి. ప్రశాంతంగా ఉండేలా చూడాలి. అధిక సమయం టీవీ చూడకుండా జాగ్రత్త వహించాలి.
* ఎప్పుడూ తరగతి పుస్తకాలే కాకుండా సాధారణ విషయాల గురించి మధ్యమధ్యలో వారికి చెబుతుండాలి. పుస్తకాలను పురుగులుగా చూడకుండా ఆసక్తి కలిగేలా చేయాలి.
* విద్యార్థులు రోజూ 8 గంటలకు తక్కువ కాకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా చూడాలి. మంచి మార్కులు రావాలని ఒత్తిడి పెంచకుండా వారిని ప్రోత్సహించాలి. ఇతర పిల్లలతో పోటీ పెట్టకూడదు.
* ఈ ఏడాది జిల్లాలో జరిగే వివిధ తరగతుల పరీక్షల తేదీలు, హాజరయ్యే విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

SCIENCE VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES