Search This Blog

Tuesday, March 1, 2016

పరిమితి పెంచలేదు.. శ్లాబు మార్చలేదు

పరిమితి పెంచలేదు.. శ్లాబు మార్చలేదు 
పన్ను రిబేటు రూ.5 వేలకు పెంపు 
ఇంటి అద్దె భత్యం రూ.60 వేల వరకూ..
గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులే ప్రధానాంశాలుగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ప్రయోజనం కల్పించలేదనే చెప్పాలి. ఆదాయపు పరిమితిని పెంచడం, శ్లాబుల్లో సవరణ తదితరాల జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. స్వల్పాదాయ వర్గాలకు మాత్రం రూ.3 వేల అదనపు పన్ను రాయితీ కల్పించడం వూరట.
ఆదాయ పరిమితి: రూ.2,50,000 ఆదాయ పరిమితిలో ఎలాంటి మార్పూ చేయలేదు.
పన్ను రాయితీ: ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 87ఏ ప్రకారం పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్నప్పుడు, చెల్లించాల్సిన పన్నులో రూ.2 వేల వరకూ రిబేటు వస్తుంది. ఈ బడ్జెట్‌లో దీన్ని రూ.5 వేలకు పెంచారు. స్వల్పాదాయ పన్ను చెల్లింపుదార్లకు అందించిన ఏకైక ప్రయోజనం ఇదొక్కటే. దీనివల్ల దాదాపు 2 కోట్ల మంది ప్రయోజనం పొందుతారనిఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఉదాహరణకు ఒక వ్యక్తి పన్ను వర్తించే ఆదాయం రూ.3,50,000 ఉన్నప్పుడు, అతను రూ.10 వేల పన్ను చెల్లించాల్సి వస్తుంది. కొత్తబడ్జెట్‌ లెక్కల ప్రకారం ఇప్పుడు అతను చెల్లించాల్సిన పన్ను రూ.5 వేలే!
ఇంటి అద్దె: కొంతమంది ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం లభించదు. ఇలాంటివారు సెక్షన్‌ 80జీజీ కింద రూ.24 వేల వరకూ లేదా వాస్తవంగా చెల్లించిన అద్దె మొత్తం ఆదాయంలో 10 శాతానికి మించి ఉంటే.. రెండింటిలో ఏది తక్కువయితే అది మినహాయింపు పొందొచ్చు. కొత్త బడ్జెట్‌లో దీన్ని రూ.60 వేలకు పెంచారు.
కొత్తగా ఇంటి రుణం: కొత్తగా ఇల్లు కొనేవారికి అదనపు మినహాయింపు కల్పించారు. ప్రస్తుత విధానంలో గృహరుణంపై వడ్డీకి రూ.2 లక్షల వరకూ మినహాయింపు లభిస్తోంది. దీనికి అదనంగా రూ.50వేల వరకూ వడ్డీ మినహాయింపును ప్రతిపాదించారు. 
ఇంటి విలువ రూ.50 లక్షల లోపు, రుణం రూ.35లక్షల లోపు ఉండాలి
చిన్న వ్యాపారులకు వూరట: సెక్షన్‌ 44ఏడీ కింద రూ.కోటి వరకూ వార్షిక అమ్మకాలు ఉన్నవారు ఎలాంటి పుస్తకాలూ నిర్వహించక్కర్లేదు. ఇప్పుడు ఈ పరిమితిని రూ.2 కోట్లకు పెంచారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో రూ.50 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికీ ఈ సెక్షన్‌ను వర్తింపజేశారు.
డివిడెండ్లపై: ప్రస్తుత విధానంలో డివిడెండ్లపై ఎలాంటి పన్నూ లేదు. కొత్త విధానంలో ఏడాదికి రూ.10 లక్షలకన్నా ఎక్కువ డివిడెండు పొందినప్పుడు 10% పన్ను చెల్లించాలి.
కార్పొరేట్‌ పన్నులు: కొత్త బడ్జెట్‌లో కార్పొరేట్‌ వర్గాలకూ పెద్ద ప్రయోజనాలేమీ కల్పించలేదు. చిన్న వ్యాపార సంస్థలకు మాత్రం కొంత పన్ను రాయితీ కల్పించారు. 
మార్చి 1, 2016 తర్వాత నమోదై, ప్రారంభమయ్యే తయారీ సంస్థలకు వర్తించే పన్ను శాతాన్ని 25 శాతానికి తగ్గించారు. దీనికి సర్‌ఛార్జి అదనం. ఆ సంస్థ పెట్టుబడి ఆధార మినహాయింపులుగానీ, అదనపు తరుగుదలలుగానీ కోరకూడదు. 
వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్లలోపు ఉన్న కంపెనీలు 29% ఆదాయ పన్ను చెల్లించాలి.
అంకుర సంస్థలకు: అంకుర సంస్థలకు మొదటి ఐదేళ్లలో మూడేళ్లపాటు ఎలాంటి పన్నులూ చెల్లించనక్కర్లేకుండా 100% పన్ను రాయితీ ఇచ్చారు. ఏప్రిల్‌, 2016 నుంచి మార్చి, 2019 మధ్య ప్రారంభమయ్యే సంస్థలకే ఇది వర్తిస్తుంది. 
నమోదుకాని కంపెనీల్లో పెట్టుబడుల దీర్ఘకాలిక మూలధన రాబడి వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. 
బ్యాంకింగేతర రుణ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు వసూలు కాని, రాని బాకీలపై మినహాయింపు ప్రతిపాదించారు. ఈ మినహాయింపు వార్షికాదాయంలో 5శాతం మేరకే అనుమతిస్తారు.
పింఛను పథకాల్లో: జాతీయ పింఛను పథకంలో మదుపు చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకునేప్పుడు 40 శాతం మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగతా 60 శాతానికి పన్ను చెల్లించాలి. గుర్తింపు పొందిన ప్రావిడెంట్‌ ఫండ్లలో ఏప్రిల్‌ 1, 2016 తర్వాత జమచేసే మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఖాతాదారుడి వారసులు ఈ మొత్తాన్ని పొందినప్పుడు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్‌-10లో ప్రతిపాదించిన సవరణ ప్రకారం ఈపీఎఫ్‌ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది.
కోటి దాటితే: రూ.కోటికి మించి ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలపై 12% సర్‌ఛార్జి విధిస్తున్నారు. కొత్తబడ్జెట్‌ ప్రకారం ఇది 15% కానుంది. 
మూలం వద్ద పన్ను వసూలు (టాక్స్‌ డిడెక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) చేసే వాటిలో అదనంగా చేర్చినవి... 
రూ.10 లక్షలకు మించిన కారు కొనుగోలు చేసినప్పుడు మూలం వద్ద 1% వసూలు చేస్తారు. 
రూ.2 లక్షలకు మించి నగదు కొనుగోళ్లు జరిపినా, సేవలు పొందినా 1% పన్ను అదనం.
- జి.సాంబశివరావు, ప్రత్యక్ష పన్నుల నిపుణులు

SCIENCE VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES