Monday, February 5, 2018

ఆఫీసులోనూ మనసు పదిలం! 

ఆఫీసులోనూ మనసు పదిలం! 
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం

ఆరోగ్యమంటే ఒక్క ఇంటితోనే ముడిపడింది కాదు. మన ఆఫీసు, పనిచేసే చోటు కూడా కీలకమే. నిజానికి చాలామంది ఇల్లు తర్వాత ఎక్కువ సమయం గడిపేది ఆఫీసుల్లోనే. నేటి పోటీ ప్రపంచంలో.. ముఖ్యంగా ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలు తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్నాయి. సమయానికి లక్ష్యాలను సాధించటం, మెరుగ్గా పని పూర్తిచేయటం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లోనూ చిక్కుకుంటున్నారు. ఉద్యోగుల్లో సుమారు 20% మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. వీటి మూలంగా పనిపై శ్రద్ధ తగ్గటమే కాదు. నైపుణ్యం, ఉత్పాదకత సైతం తగ్గుతున్నాయి. ఇది కేరీర్‌నూ దెబ్బతీస్తుంది. అందుకే ప్రపంచ మానసిక ఆరోగ్యదినం (అక్టోబర్‌ 10) సందర్భంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా పనిచేసే చోట్ల మానసిక సమస్యలనూ పట్టించుకోవాలని నినదిస్తోంది. 
ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన, ఏకాగ్రతను దెబ్బతీసే అతి చురుకుదనం (ఏడీహెచ్‌డీ), ఉంటే అతి హుషారుగా లేకుంటే అతి విచారంగా (బైపోలార్‌ డిజార్డర్‌) ఉండటం.. ఇలాంటి మానసిక సమస్యలు ఉద్యోగుల్లో ఎక్కువ. అయినా వీటి గురించి చాలామంది బయటకు చెప్పుకోవటం లేదు. చెబితే తోటి ఉద్యోగులు ఎలా స్పందిస్తారో, యాజమాన్యం ఏమంటుందో, ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో లోలోపలే దాచుకుంటుంటారు. వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకపడిపోతుంటారు. అయితే వీటి గురించి తెలుసుకోవటం చికిత్స తీసుకోవటం చాలా అవసరం. అంతకన్నా ముందు ఇలాంటి సమస్యల బారినపడకుండా చూసుకోవటం మరీ ముఖ్యం. ఇందుకు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం బాగా ఉపయోగపడుతుంది. 
** కలివిడితనం: తోటి ఉద్యోగులతో సన్నిహితంగా, కలివిడిగా ఉండటం మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. అందువల్ల ఆఫీసులో ఉన్నప్పుడు సహోద్యోగులకు ఫోన్‌ చేయటం, ఈమెయిల్‌ పంపటం కన్నా స్వయంగా వెళ్లి కలుసుకోవటం.. కొత్త కొత్త విషయాల గురించి చర్చించుకోవటం మంచిది. వారాంతాల్లో ఎలా గడిపారో ఆరా తీయటం.. వీలైతే తోటివారికి లిఫ్ట్‌ ఇవ్వటం, వారితో కలిసి ప్రయాణించటం వంటివీ ఎంతో మేలు చేస్తాయి. తోటి ఉద్యోగులపై విమర్శలు చేయటం, తగవులు పెట్టుకోవటం కేరీర్‌కే కాదు.. మానసిక ఆరోగ్యానికీ చేటు చేస్తాయి. 
** వ్యాయామం: పని ఒత్తిడితోనో, మరే కారణంతోనో చాలామంది వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ఎంతమాత్రం తగదు. విషయగ్రహణ సామర్థ్యం క్షీణించకుండా ఉండటానికి, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం తోడ్పడుతుంది. అలాగని రోజూ జిమ్‌లకు వెళ్లాల్సిన పనీ లేదు. కాస్త వేగంగా నడిచినా చాలు. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కటం, మధ్యాహ్నం భోజనం చేశాక అటూఇటూ నాలుగడుగులు వేయటం, ఆఫీసు స్టాప్‌కు కాస్త దూరంగా బస్సు దిగి నడవటం, అప్పుడప్పుడు ఆఫీసుల్లో ఆటల పోటీలు ఏర్పాటుచేసుకోవటం వంటి పనులు వ్యాయామంతో పాటు సామాజిక సంబంధాలు మెరుగుపడటానికీ దోహదం చేస్తాయి. 
** నేర్చుకోవటం: నేర్చుకోవటమనేది నిరంతర ప్రక్రియ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవరాదు. ఇది మన ఆత్మ విశ్వాస్వాన్ని పెంపొందిస్తుంది. ఇతరులతో సంబంధాలు పెరగటానికి, మరింత చురుకుగా ఉండటానికి తోడ్పడుతుంది. కాబట్టి మనకు మనమే లక్ష్యాలను నిర్దేశించుకోవటం, వాటిని సాధించటానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవటం ఒక అలవాటుగా చేసుకోవాలి. పుస్తకాలు, వార్తలు చదవటం.. నిపుణుల ప్రసంగాలు వినటం మేలు. వీలైతే కొత్త విషయాలను నేర్చుకోవటానికి కొత్త చదువుల్లో లేదా కోర్సుల్లో చేరొచ్చు కూడా. 
** దాతృత్వం: స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, ఇతరులకు సహాయం చేయటం వంటివీ మనసుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఇలాంటి పనులు చేసేవారు మరింత ఆనందంగా, హుషారుగా ఉంటున్నట్టు అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. కాబట్టి తోటివారు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవటం, చేతనైనంత సహాయం చేయటం ద్వారా మానసిక ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES