*🌷విషయం :-*
*వాట్సాప్‌లో ఫిర్యాదులు ఎలా చేయాలంటే..*🌟
*25.09.2018..07:40PM*
*దిల్లీ:* ఇటీవల వాట్సాప్ సహా కొన్ని సోషల్‌మీడియా వేదికల్లో నకిలీ వార్తలు, వదంతులు వ్యాపించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మూకదాడులు జరిగాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో ఇలాంటి వదంతులపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం.. నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని వాట్సాప్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని వినియోగదారుల కోసం వాట్సాప్ సంస్థ ఫిర్యాదుల అధికారిని నియమించింది. వాట్సాప్‌లో సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న కోమల్ లాహిరిని భారత్‌లో ఫిర్యాదుల స్వీకరణాధికారిగా నియమించినట్లు వాట్సాప్ తెలిపింది. మరి ఈ అధికారిని మనం ఎలా సంప్రదించాలి. ఫిర్యాదులు ఎలా చేయాలి అంటే..
🌼కోమల్ లాహిరి అమెరికాలో ఉంటూనే భారత వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఇందుకోసం వినియోగదారులు ఈ-మెయిల్ లేదా పోస్టు ద్వారా తమ ఫిర్యాదులు పంపవచ్చు అని వాట్సాప్ తెలిపింది. ‘మీ ఫిర్యాదును ఈ-మెయిల్ ద్వారా కోమల్ లాహిరికి పంపవచ్చు. ఫిర్యాదు కింద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేయాలి. ఒక నిర్దిష్ట ఖాతా గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే మీ ఫోన్ నంబరును కూడా జత చేయాల్సి ఉంటుంది’ అని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
🌼ఇక పోస్టు ద్వారా ఫిర్యాదు చేయాలనుకునేవారు.. ‘కోమల్ లాహిరి, వాట్సాప్ ఇన్, అటెన్షన్: గ్రీవెన్స్ ఆఫీసర్, 1601 విల్లో రోడ్, మెన్లో పార్క్, కాలిఫోర్నియా 94025, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ అనే చిరునామాకు ఫిర్యాదులను పోస్టు చేయవచ్చని తెలిపింది. అంతేగాక.. ఫోన్లో వాట్సాప్ యాప్ నుంచి కూడా ఫిర్యాదు చెయ్యొచ్చు. ఇందుకోసం.. వాట్సాప్ ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి.. అక్కడ ‘హెల్ప్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ ‘కాంటాక్ట్ ’ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసి మన ఫిర్యాదును సెండ్ చెయ్యొచ్చు.
🌼ఈ ఫిర్యాదులను పరిశీలించి కోమల్ లాహిరి బృందం తగిన చర్యలు తీసుకుంటారని కంపెనీ వెల్లడించింది. నకిలీ వార్తలు, వదంతులపై ఫిర్యాదులతో పాటు వాట్సాప్ సేవలపై ఉన్న నిబంధనలు, ఖాతా గురించి వివరాలను కూడా ఈ గ్రీవెన్స్ అధికారిని అడిగి తెలుసుకోవచ్చు అని వాట్సాప్ తెలిపింది.
🌟🔶🌟🔶🌟🔶🌟