*🌺ఆధార్ చట్టబద్ధమే: సుప్రీంకోర్టు🌺*
👉దిల్లీ: ఆధార్ చట్టబద్ధత అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆధార్ గుర్తింపు చట్టబద్ధమేనని జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ విశిష్ఠమైనదని సుప్రీం పేర్కొంది. అయితే ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని చెప్పింది. ఇందుకోసం కేంద్రం వీలైనంత త్వరగా సమాచార భద్రతకు చట్టం తీసుకురావాలని సూచించింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఆధార్ సమాచారం ఇవ్వవద్దని తెలిపింది. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆధార్ ఒక గుర్తింపు అని.. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్ సేవలు ఉన్నాయంది. కనీస మొత్తంలో వ్యక్తిగత సమాచారం మాత్రమే ఆధార్ తీసుకుంటుందని.. నకిలీ ఆధార్ సృష్టించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
👉పాఠశాల ప్రవేశాలకు, బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
👉మొబైల్ కంపెనీలు ఆధార్ కార్డు డిమాండ్ చేయడానికి వీల్లేదని పేర్కొంది.
👉అయితే పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేసింది.