Search This Blog

Thursday, February 18, 2016

పీపీఎఫ్‌..భద్రంగా.. భరోసాగా!

ఆదాయపు పన్ను మినహాయింపు రావాలి... పెట్టుబడికి భద్రత ఉండాలి.. రాబడికి హామీ కావాలి.. ఇవన్నీ ఒకే పథకంలో సాధ్యమేనా? ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) ఈ ప్రయోజనాలన్నీ కల్పిస్తోంది. పిల్లల చదువులు, పదవీ విరమణ తదితర దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పొదుపు చేయాలని భావించే వారికి ఓ నమ్మకమైన పథకం ఇది. పన్ను ఆదా పథకాల్లో అధిక ఆకర్షణ ఉన్న ఈ ప్రభుత్వ పొదుపు పథకం గురించి సాధారణంగా వచ్చే సందేహాలు.. వాటికి సమాధానాలు తెలుసుకుందామా!
సాధారణ పథకాలతో పోలిస్తే.. ప్రభుత్వ హామీతో ఉండే పెట్టుబడి పథకాలపై ప్రజలకు నమ్మకం అధికంగా ఉంటుంది. అందుకే, చాలామంది చిన్న మొత్తాల పొదుపు పథకాల వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. ముఖ్యంగా పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టాల్సిన ప్రస్తుత తరుణంలో అటు ఉద్యోగం చేసేవారు, ఇటు వృత్తి, వ్యాపారాలు నిర్వహించేవారు మదుపు చేసేందుకు వీలున్న పథకం పీపీఎఫ్‌.
ఎవరు చేరవచ్చు?
మన దేశంలో నివసించే వ్యక్తులు ఎవరైనా తమ పేరుతో ఈ ఖాతాను ప్రారంభించొచ్చు. మైనర్ల పేరుతో తండ్రి లేదా తల్లి పీపీఎఫ్‌ ఖాతా తెరవొచ్చు. ఉద్యోగ భవిష్య నిధి ఉన్నవారు కూడా పరిమితులకు లోబడి ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.
భార్య, భర్తలు ఉమ్మడిగా ఖాతా తెరవచ్చా?
దంపతులిద్దరూ కలిసి ఉమ్మడి ఖాతా ప్రారంభించేందుకు వీల్లేదు. విడివిడిగానే ఖాతాలు తీసుకోవాలి. ఒకరి పేరుతో ఒక్కటే ఖాతా ఉండాలి. పొరపాటున రెండో ఖాతా తెరిస్తే రెండో ఖాతాకు వడ్డీ రాదు.
మైనర్ల తరఫున తండ్రి ఖాతా తెరిస్తే, తండ్రి తన ఖాతాలో రూ.1,50,000; ఇద్దరు మైనరు పిల్లల పేరుతో ఒక్కొక్కరికి రూ.1,50,000 చొప్పున మొత్తం ఏడాదికి రూ.4,50,000 కట్టొచ్చా?
అన్ని ఖాతాలలో కలిపి తండ్రి ఏడాదికి రూ.1,50,000 మాత్రమే కట్టొచ్చు. రెండో పిల్లాడి పేరుతో తల్లి ఖాతా తెరిస్తే ఆమె విడిగా రూ.1,50,000 కట్టొచ్చు.
2012లో పీపీఎఫ్‌ ఖాతా ప్రారంభించారు. 2014, 2015లో డబ్బు జమ చేయలేదు. ఇప్పుడు పునరుద్ధరణకు అవకాశం ఉందా?
కనీస మొత్తం కూడా జమ చేయని ఏడాదికి రూ.50 చొప్పున అపరాధ రసుము విధిస్తారు. ఈ రుసుముతోపాటు, జమ చేయని సంవత్సరాలకు సంబంధించిన బాకీలను కూడా కట్టి ఖాతాను కొనసాగించవచ్చు. ఇక్కడ 2014, 2015 సంవత్సరాల బాకీ రూ.1,000 (ఏడాదికి రూ.500 చొప్పున), 2014 బాకీ రెండేళ్లు జమ చేయనందుకు రూ.100 రుసుము; 2015లో చెల్లించనందుకు రుసుము రూ.50.. మొత్తం కలిపి రూ.1150 చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు.
కనీస మొత్తం చెల్లించని పీపీఎఫ్‌ ఖాతాలో నుంచి డబ్బు తిరిగి ఎప్పుడు తీసుకోవచ్చు?
పీపీఎఫ్‌ గడువు 15 ఏళ్లు. గడువు ముగిసిన తర్వాత ఖాతా డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులు తీసుకునే ముందు నెల వరకూ వడ్డీ వస్తుంది.
ఎంత చెల్లించాలి? ప్రయోజనాలేమిటి?
ఈ ఖాతాలో ఏడాదికి కనీసం రూ.500 జమ చేయాలి. గరిష్ఠంగా రూ.1,50,000 కట్టొచ్చు. ఏడాదిలో 12 వాయిదాల్లో చెల్లించొచ్చు. ఒక నెలలో ఎక్కువ, మరో నెలలో తక్కువ కూడా కట్టొచ్చు. ఒక ఏడాదిలో రూ.1,50,000 కంటే ఎక్కువ కడితే అదనంగా కట్టిన మొత్తంపై వడ్డీ రాదు.ఇందులో జమ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ పరిమితికి లోబడి పన్ను మినహాయింపు లభిస్తుంది. పిల్లలు, జీవిత భాగస్వామి పేరుతో కట్టే మొత్తానికీ మినహాయింపు లభిస్తుంది. వచ్చిన వడ్డీకి, వ్యవధి తర్వాత తీసుకునే మొత్తానికీ పన్ను వర్తించదు.
పీపీఎఫ్‌ సాంఘిక భద్రతా పథకం కాబట్టి, ఇందులో జమ చేసిన మొత్తాన్ని అప్పు వసూలుకోసం అటాచ్‌ చేస్తూ కోర్టులు కూడా ఆదేశాలు ఇవ్వరాదు. ఆదాయపు పన్ను, ఎస్టేట్‌ డ్యూటీ బాకీలకు పీపీఎఫ్‌ నిల్వను అటాచ్‌ చేయవచ్చు. అయితే, ఆదాయపు పన్ను బాకీలకు పీపీఎఫ్‌ మొత్తాన్ని అటాచ్‌ చేయరాదని ఒక కేసులో గుజరాత్‌ హైకోర్టు 2014లో పేర్కొంది.
ఈ పథకం వ్యవధి 15 ఏళ్లు. కాబట్టి, దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే. పిల్లల చదువులు, పెళ్లి, పదవీ విరమణ ప్రణాళిక, విహార యాత్రల వంటి అవసరాలకు అనువైన పథకం.
ఒక్కరి పేరుపైనే నామినేషన్‌ ఇవ్వాలా?
పెద్దల పేరుతో ఉన్న ఖాతాలో ఒకరు అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనవచ్చు. ఎవరికి ఎంత వాటా చెందాలో కూడా రాయొచ్చు.
ఖాతాదారు మరణానంతరం నామినీ ఆ ఖాతాను కొనసాగించే వీలుందా? మైనర్‌ పేరుతో ఖాతా ఉన్నప్పుడు తండ్రి చనిపోతే ఎలా?
సాధ్యం కాదు. ఖాతాదరు చనిపోతే అప్పటి వరకూ జమ అయిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. వ్యవధి తీరేంతవరకూ ఆగాల్సిన అవసరం లేదు. మైనర్‌ తండ్రి మరణిస్తే.. మైనర్‌ పేరుతో ఉన్న ఖాతాను ఇతర సంరక్షకులు కొనసాగించొచ్చు.
2015-16 సంవత్సరంలో ప్రారంభించిన పీపీఎఫ్‌ ఖాతాలో ఏడాదికి రూ.20వేల చొప్పున కడితే అందులో నుంచి కొంత డబ్బు తీసుకోవాలంటే ఎప్పుడు, ఎంత తీసుకోవచ్చు?
ఖాతాను ప్రారంభించిన తర్వాత ఐదు ఆర్థిక సంవత్సరాలు పూర్తి అయ్యాక అంటే.. 2021-22లో పాక్షికంగా డబ్బును వెనక్కి తీసుకునే వీలుంటుంది. సొమ్మును వెనక్కి తీసుకునే సమయానికి (2021-22) నాలుగేళ్ల ముందు (2017-18) ఆర్థిక సంవత్సరం చివరలో ఉన్న నిల్వ (రూ.60,000)లో సగం రూ.30,000 తీసుకోవచ్చు. సొమ్ము తీసుకోబోయే ఏడాది ముందు (2020-21లో) పీపీఎఫ్‌ నిల్వ రూ.30,000 కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తాన్నే తీసుకోవాలి. ఏడాదికి ఒక్కసారే సొమ్మును వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు.
2015-16లో ప్రారంభించిన పీపీఎఫ్‌ ఖాతాపై రుణం ఎప్పుడు తీసుకోవచ్చు? ఎంత వడ్డీ కట్టాలి?
2015-16లో ఖాతా ప్రారంభిస్తే 3వ ఏట (2017-18) నుంచి 6వ ఏట (2020-21) వరకూ అప్పు తీసుకోవచ్చు. అప్పు తీసుకోవడానికి రెండేళ్ల ముందు ఆర్థిక సంవత్సరం ముగింపు నిల్వలో 25% అప్పు తీసుకోవచ్చు. అప్పుపై 2% వడ్డీ కట్టాలి. అప్పు మొత్తం వరకూ పీపీఎఫ్‌ నిల్వపై వడ్డీ రాదు. మూడేళ్లలో అప్పు తీర్చకపోతే రుణ నిల్వపై 6%వడ్డీ కట్టాలి. అప్పుపై వడ్డీ కట్టకపోతే ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం చివరలో వడ్డీ మొత్తాన్ని పీపీఎఫ్‌ నిల్వ నుంచి మినహాయిస్తారు. మైనర్‌ పేరుతో ఖాతా నుంచి మైనర్‌ అవసరాలకు అప్పు తీసుకోవచ్చు.
2015-16 నుంచి ప్రతి ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన రూ.10,000 కడుతూ ఉంటే పీపీఎఫ్‌ ఖాతా గడువు ఎప్పుడు ముగుస్తుంది? ఎంతొస్తుంది?
ఖాతా ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం (2015-16) ముగింపు నుంచి 15 ఆర్థిక సంవత్సరాలు పూర్తి అయ్యాక 2031 ఏప్రిల్‌లో ప్రస్తుత 8.7% వార్షిక చక్రవడ్డీ ప్రకారం రూ.3,49,718 తీసుకోవచ్చు. పీపీఎఫ్‌లో వడ్డీని మార్కెట్‌ పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రతి నెలా 5వ తేదీ నుంచి నెలాఖరు లోపు ఖాతాలో ఉన్న కనిష్ఠ మొత్తంపై వడ్డీని లెక్కించి ఇస్తారు. గడువు కంటే ముందు డబ్బు తీసుకోవడం కుదరదు. పీపీఎఫ్‌ ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతితో మాత్రమే ముందస్తు రద్దుకు అనుమతి ఇస్తారు.
15 ఏళ్ల గడువు తర్వాత ఖాతాను కొనసాగించొచ్చా?
మరో 5 ఏళ్లు కొనసాగించొచ్చు. ఆ తర్వాత మరో 5ఏళ్ల చొప్పున పెంచుకోవచ్చు. పొడిగించిన 5 ఏళ్ల కాలంలో జమ చేసుకోవచ్చు. జమ చేయకుండా కూడా కొనసాగించొచ్చు. పొడిగించిన 5 ఏళ్లలో ఏడాదికి ఒకసారి సొమ్మును వెనక్కి తీసుకోవచ్చు. జమలు కొనసాగిస్తే ఐదేళ్ల ప్రారంభ నిల్వలో 60శాతం వెనక్కి తీసుకోవచ్చు. జమలు కొనసాగించకుండా 15ఏళ్ల పీపీఎఫ్‌ నిల్వ కొనసాగిస్తే గరిష్ఠ పరిమితితో నిమిత్తం లేకుండా సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. ఖాతాను కొనసాగించే 5ఏళ్ల కాలంలో కొత్తది ప్రారంభించడం కుదరదు.
ఈ ఖాతాను ఎక్కడ ప్రారంభించాలి? బ్యాంకు, పోస్టాఫీసులలో ఉన్న పీపీఎఫ్‌ ఖాతాను మరో చోటకు బదిలీ చేయవచ్చా?
పలు స్టేట్‌ బ్యాంకు శాఖలు, 14 జాతీయ బ్యాంకులు, ప్రధాన పోస్టాఫీసులలో పీపీఎఫ్‌ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు లేదా పోస్టాఫీసుకు పీపీఎఫ్‌ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. బ్యాంకులో తెరిచిన పీపీఎఫ్‌ ఖాతాకు ఆన్‌లైన్‌లో కూడా జమ చేసుకోవచ్చు. ఖాతా బదిలీ వల్ల వడ్డీ నష్టం రాదు. బ్యాంకులు, పోస్టాఫీసులు కేంద్ర ప్రభుత్వం తరఫున జమలు స్వీకరిస్తాయి. 

SCIENCE VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES