Search This Blog

Thursday, October 22, 2020

ఎస్. ఆర్. శంకరన్ జయంతి

 ఎస్. ఆర్. శంకరన్ గా ప్రసిద్ధిచెందిన సిరిగలత్తూర్ రామనాధన్ శంకరన్ తమిళనాడులోని తంజావూరు జిల్లా సిరిగలత్తూరు గ్రామంలో 1934, అక్టోబర్ 22న జన్మించారు. శంకరన్ తండ్రి రైల్వేగార్డుగా పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు బదిలీ అయి వెలుతుండటంతో ఆయన చదువు వివిధ ప్రాంతాలలో కొనసాగింది. మద్రాసు లయోలా కళాశాలలో బి.కాం. (ఆనర్స్) చదివారు. మధురైలోని కళాశాలలో కొంతకాలం కామర్స్ లెక్చరర్‌గా పనిచేశారు. ఎస్‌.ఆర్‌.శంకరన్‌ 1957 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. 

నెల్లూరు జిల్లా కలెక్టరుగా, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేసిన ఆయన 1992లో పదవీ విరమణ చేశారు. పెళ్ళి చేసుకుంటే పేదల కోసం పూర్తిగా పని చేయాలన్న ఆలోచనకు ఆటంకం కలుగుతుందని బ్రహ్మచారి గానే ఉండిపోయారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మూడేళ్లపాటు పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రతిపాదించినా శంకరన్‌ తిరస్కరించారు. 1987లో నక్సల్స్‌ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ మావోయిస్టు పార్టీ (అప్పట్లో పీపుల్స్‌వార్‌) శంకరన్‌ను తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్‌ చేసింది. పేదలు, దళితుల తరఫున గట్టిగా వాదనను వినిపించేవారు. బొగ్గు గనులను జాతీయం చేయడంలోనూ, వెట్టి చాకిరీని నిర్మూలించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఆహార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో పోలీసు ఎన్‌కౌంటర్లు, నక్సల్‌ ప్రతి హింసల కారణంగా నెలకొన్న పరిస్థితులతో కలత చెందిన ఆయన శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు కృషి చేశారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన శాంతి చర్చల్లో ప్రధాన భూమిక పోషించారు. దేశవ్యాప్తంగా ఐటీడీఏల ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన కాలంలోనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లకు వూపిరి పోశారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఎస్సీ ఉప ప్రణాళిక (ఎస్‌సీఎస్‌పీ), గిరిజన ఉప ప్రణాళికలకు (టీఎస్‌పీ) రూపకల్పన చేశారు.7.10.2010 న హైదరాబాదులో చనిపోయారు.


విశేషాలు సవరించు

ప్రజల వద్దకు పాలన అంటే ఎలా ఉంటుందో ఆచరణలో చూపారు. వీరి సేవలకు గుర్తింపుగా నెల్లూరు జిల్లాలో శంకరపురం, శంకరన్ నగర్‌లు అనేకం ఉన్నాయి.

సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్న సమయంలో లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉండేవారు. సచివాలయానికి నడిచివచ్చేవారు.

సచివాలయానికి ఉదయాన్నే తొమ్మిదన్నరలోగా చేరుకునేవారు. రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేసేవారు.

మెదక్ జిల్లా ‘ఖానాపూర్’లో వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులను సమావేశపరిచి వారికి వెట్టిచాకిరి నుంచి ఎట్లా విముక్తి కావాలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి బోధించారు. ఫలితంగా భూస్వాముల వద్ద పనిచేసే జీతగాళ్ళంతా తిరుగుబాటు చేశారు.

చెన్నారెడ్డితో వెట్టిచాకిరి నిర్మూలన అంశంపై విభేదించిన శంకరన్ గారిని త్రిపుర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించమని కోరింది. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నృపేన్ చక్రవర్తి. ఆయన కూడా శంకరన్ వలె అవివాహితుడు. శంకరన్ గారికి పాలన విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. త్రిపురలో శంకరన్ ప్రభుత్వ అతిథి గృహంలో ఉండేవారు. ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునేవారు. వివాహం ప్రజాసేవకు అడ్డంకిగా భావించిన ఈ ఇద్దరూ కేవలం రెండుగదుల ఇళ్ళలో నివసిస్తూ రాష్ట్రాన్ని చక్కగా పాలించవచ్చని నిరూపించారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని గుర్తేడు గ్రామంలో గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించడానికి వెళ్ళిన సందర్భంలో శంకరన్‌తో సహా దాదాపు 11 మంది అధికారులను మావోయిస్టులు నిర్బంధించారు. ఆ తరువాత 12 రోజులకు విడుదల చేశారు.

పంజాగుట్టలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఆయన ఇల్లు ఎంతో సాదా సీదాగా ఉండేది. సఫాయి కర్మచారి ఉద్యమానికి ముఖ్య నాయకుల్లో ఒకరుగా, తనకు వచ్చే పెన్షన్‌ డబ్బును దళిత విద్యార్థుల పైచదువుల కోసం వెచ్చించేవారు. వీధిబాలలు, వికలాంగులకు ఆశ్రమాలు నడిపే స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేసేవారు.

హైదరాబాదు‌ పబ్లిక్‌ స్కూల్‌ల్లో ఎస్‌.సి, ఎస్‌.టి.లకు చదువుకునే అవకాశం, రిజర్వేషన్లు అమలు చేయించారు.

నిరంతరం పేదప్రజల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డుకు ఎంపికచేసింది. కాని సన్మానాలకు దూరంగా ఉండే శంకరన్‌ సున్నితంగా తిరస్కరించారు. ఆయన ఎప్పుడూ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. తనకి పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించినప్పుడు దాన్ని తిరస్కరించడమే గాక, ఆ విషయం ప్రచురించవద్దని పత్రికా విలేకరులను ప్రాథేయపడ్డారు.ఆయన మరణించిన తరువాత ప్రభుత్వమే అధికారికంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసింది.

2014 మే 25న పూర్ణ, ఆనంద్‌ అనే తెలంగాణ దళిత బాలలు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి శిఖరం మీద జాతీయ పతాకం, అంబేద్కర్‌ చిత్రపటంతో పాటు శంకరన్ గారి చిత్రపటం కూడా ప్రదర్శించారు.

కలెక్టరుగా ఉంటూ నెల్లూరు కనక మహల్‌లో క్యూలో నిలబడి సినిమా టికెట్‌ కొనుక్కున్న వ్యక్తి శంకరన్‌.

ఒక గ్రామమంత వైశాల్యం ఉన్న బంగళా కలెక్టరు కుటుంబానికి నివాసంగా ఉండటం అనవసరం అని నెల్లూరులోని కలెక్టరు బంగళాని ఉమెన్స్‌ కాలేజీగా మార్చేశారాయన.

రైలు ఎక్కేటప్పుడు తన పక్కన డఫేదారు వుంటే ఎక్కిన తరువాత తానెవరో తోటి ప్రయాణీకులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని తనకి వీడ్కోలు ఇవ్వటానికి వచ్చే అధికారుల్ని కూడా పక్కన డఫేదారు ఉండకూడదనే షరతుపైనే అక్కడకు రానిచ్చేవారు.

పదవీ విరమణ తరువాత మన రాష్ట్రంలోనే స్థిరపడి 2010, అక్టోబరు 7న హైదరాబాదు‌లో డెబ్బయ్యారేళ్ళ వయసులో చనిపోయారు

తెలంగాణలోని వనపర్తిజిల్లా, వనపర్తిలో 2011, అక్టోబర్‌ 7వ తేదిన పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహకారంతో జనశ్రీ సంస్థ జి. రాజు ఆధ్వర్యంలో శంకరన్‌ పార్క్ లో విగ్రహావిష్కరణ జరిగింది.

SCIENCE VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top