Search This Blog

Sunday, April 11, 2021

ఏప్రిల్ 11 భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి

 ఏప్రిల్ 11 భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త మహాత్మా  జ్యోతిరావ్ పూలే  జయంతి శుభాకాంక్షలు- 

                                    

విద్య ద్వారానే సమాజాన్ని మార్చాలని,  అణిచివేయ బడుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షర జ్యోతులు వెలిగించి సమాజాన్ని చైతన్య పరిచిన మహనీయుడు, విద్యావ్యాప్తి కోసం ఆజన్మాంతం అగ్రకుల, ఆధిపత్య పెత్తందారులతో అక్షర యుద్ధం చేసిన గొప్ప సంఘసంస్కర్త,అసమానతలను చేధించిన క్రాంతిరేఖ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి,ఆదిగురువు మహాత్మ జ్యోతిరావు పూలే గారు..


మనం ప్రపంచ మేధావిగా కొలిచే డా,, B.R అంబేద్కర్ గారే 'పూలే' గారిని తన ఉద్యమ గురువుళ్ళల్లో ఒక గురువుగా భావించిన సందర్భం..అసమానతలు లేని సమాజం కోసం ఆయన పడ్డ శ్రమ,తపన..తన జీవిత భాగస్వామి ఐనా సావిత్రిబాయ్ పూలే" గారిని "చదువుల తల్లి"గా మార్చి తన ఉద్యమాల్లో భాగం చేసి అట్టడుగు,అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడ్డ మహనీయుడి కృషి చారిత్రాత్మకమైనది..అంతేకాదు 'గులాంగిరితో' కుల కుట్రల గుట్టును రట్టు చేసి,మనువాదాన్ని తిరస్కరించి బ్రాహ్మణాధిపత్యాన్ని ఖండిస్తూ 'దీనబందుతో' 'స్వేచ్ఛ'ను సామాన్యుల వేతలను సమాజానికి చూపిన ధీరుడు, మహిళా హక్కులు కూడా మానవ హక్కులేనని చాటుతూ 'స్త్రీ'ల హక్కులకై పోరాడుతూ సమానత్వాన్ని కోరిన సామాజిక వైతాళికుడు,సామాజిక తత్వవేత్త సమాజ హితం కోసం సర్వసం ధారపోసి శ్రామికుడు అందరికంటే ముందుగా మానవాళి చేతనే "మహాత్మా" అని పిలిపించుకున్న గొప్ప మానవతావాది పూలే గారు.


కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు మహాత్మ జోతిరావ్‌ గోవిందరావు ఫూలే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకా రుడు, సంఘసేవకుడెైన ఫూలే మహారాష్టక్రు చెందినవా డు. ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసంపోరాడాడు. మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్‌ 11న జోతిరావ్‌ ఫూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది.


 జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది.7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.


అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జోతిరావ్‌కు చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనేఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన 1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. 


సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. 


చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే .జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. 


థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.


అమెరికా స్వాతంత్య్రపోరాటం ఆయనను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది.


 గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు.


13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయినతర్వాత ఆయన తన కుటుంబవ్యాపారమైన పూలవ్యాపారం ప్రారంభించాడు.


1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి ‘మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. భార్య ప్రోత్సాహంతో  ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మణుల నువిమర్శించ డమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపి బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు. 


సమాజంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు.


 1948 ఆగస్ట్‌లో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అస్పృస్యులకు కూడా బోధించవలసిరావడంతోఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు.


 పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్‌, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు.క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు.


ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడాని కి సమాజం అంగీకరించేదికాదు.  అందువల్ల వితంతు పునర్ 

వివాహాలను  గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 


1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్ర్తీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు.


1873 సెప్టెంబర్‌ 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు.


కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు.


1891లో ప్రచురించిన సార్వజనిక్‌ ధర్మపుస్తక్‌ మత, సాంఘిక విషాయలపెై ఫూలే అభిప్రాయా లను తెలియచేస్తుంది. స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు.


 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈతరహలో ఒక భారతీయ హిందువు ఒకసంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి.


 1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు. 


1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’ పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు. 


1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లొఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు.దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపెై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు.భారతదేశంలోని శూద్రాతి శూద్రులు దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు  బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు, అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.


 1883 కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సయంలో ప్రచురితమైన తన హెచ్చరిక  బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు.


1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు.మధ్యపానాన్ని వ్యతిరేకించి,1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మధ్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు. 


ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు.


ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివర్లో ‘దీనబంధు’ వారపత్రికను ముంబయిలో స్థాపించాడు. దీనిలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. శెత్కర్యాచ అస్సోడ్‌ పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది.


భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనల, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు.


దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. 


 దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించు కొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’. 


సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. 


దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన సమన్యాయ సత్యశోధకుడు మహాత్మ ఫూలే1890 నవంబరు 28న కన్నుమూశాడు.


అనేక సంఘర్షణలతో కూడిన నేటి సమాజానికి ఆలోచనపరమైన ఆశయ రూపం.. అన్యాయాలను, ఆధిపత్యాన్ని ఎదిరించిన అక్షర యుద్ధం.. అజ్ఞానంతో నిండిన అట్టడుగు వర్గాల చైతన్య స్వరూపం..హక్కుల పోరుతో అక్కున చేరిన ఆరాధ్య దైవం మహాత్మా పూలే.. 


పీడిత ప్రజల్ని చైతన్యపరచి సమానత్వంతో కూడిన అధికారాన్ని సాధించాలని చాటిన ఆమహనీయుడి ఆలోచన విధానానికి అనుగుణంగా అణగారిన వర్గాలు ఐక్యతతో ముందుకు నడవాలి..


వారి ఆశయాల సాధన కోసం సంఘటితంగా కృషిచేస్తూ.. ఆమహాత్ముడి పోరాట చరిత్రను, ఉద్యమ స్ఫూర్తిని,త్యాగనిరతిని భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలి..


వారు కలలు కన్న నూతన సమాజ నిర్మాణమే మనం ఆయనకు ఇవ్వగలిగే ఘనమైన "నివాళి".

కెకెవి నాయుడు.....

SCIENCE VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top